మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి - ఉద్యమ ప్రారంభం

స్వదేశీ జాగరణ మంచ్ అధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ జాతరపై ఆర్ధిక, సామాజిక కారణాలతో సర్వే కొనసాగుతుంది. కుంభమేళా తరువాత దేశంలో అతి పెద్దదైన గిరిజన సాంప్రదాయ పండుగగా పేరు గాంచిన మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని స్వదేశీ జాగరణ మంచ్ డిమాండ్ చేస్తున్నది. మే 19 వ తేది నుండి నెల రోజులపాటు 50 గ్రామాలలో 2000 మందికి పైగా ప్రజలను కలిసి జాతర ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఛత్తీస్ గధ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరావడం, రెండేళ్ళ కొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి నుండి 3 రోజులపాటు జరిగే ఈ జాతరలో 80 లక్షల నుండి 1 కోటిమంది వరకు భక్తులు పాల్గొనటం విశేషంగా చెప్పుకోవచ్చు.
1998 లో ఈ జాతరను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటికీ ఏర్పాట్లకు గాను ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవటం లేదని, సౌకర్యాలు అంతంత మాత్రమేనని భక్తులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో జూన్ 28 న వరంగల్ లో జరిగిన రాష్ట్ర సదస్సులో టి.పురుషోత్తమరావు, శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, సీతక్క, అఖిల భారత సంచలన సమితి సభ్యులు శ్రీ పి. మురళీధర్ రావు, సమ్మక్క - సారలమ్మ పూజారులు మరియు తెలుగు యునివర్సిటికి చెందిన ప్రోఫెస్సార్లు, ప్రజా ప్రతినిధులు, కోయ సంఘాల నాయకులూ పాల్గొన్నారు. మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు నివ్వాలని సభికులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సదస్సులో సమ్మక్క - సారలమ్మ జాతరపై రూపొందించ బడిన పాటల సి.డి. ని ఆవిష్కరించారు.
సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మేడారం జాతర సేవ-సమైక్య పేరుతో అఖిల భారత సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. మేడారం జాతర సేవ-సమైక్య కన్వినర్ శ్రీ యన్.వీరగోపాల్, కో-కన్వీనర్ సత్యపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments: